ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. వివరాలు లోకి వెళితే గురువారం లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రెవేశ పెట్టాగా ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. నాలుగు గంటల చర్చ అనంతరం లోక్‌సభలో బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించగా 245 ఓట్లు అనుకూలంగా, 11 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశాయి. లోక్‌సభలో ఓటింగ్‌ సందర్భంగా బీజేపీ ఎంపీలు ‘భారత్‌ మాతాకి జై’ అంటూ నినాదాలు చేశాయి. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించగానే బల్లలు చరిచి హర్షద్వానాలు చేశారు. మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు.

అంతకుముందు బిల్లుపై అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘానికి నివేదించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బిల్లు ఉందని వాదించాయి. అయితే ముస్లిం మహిళల గౌరవానికి కాపాడేందు​కే బిల్లు తెచ్చామని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై చర్చకు సిద్ధమని, విపక్షాల వాదన వినేందుకు అభ్యంతరం లేదని ప్రకటించింది. మరోవైపు బిల్లుపై ఓటింగ్‌ నేపథ్యంలో సభలో ఉండాలని బీజేపీ, కాంగ్రెస్‌ తమ సభ్యులకు విప్‌ జారీచేశాయి.