ఘనంగా రహదారి భద్రతా వారోత్సవాలు

పొదిలిలో రహదారి భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే 30వ రహదారి వారోత్సవాలలో భాగంగా పొదిలి పొదిలి పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీసు స్టేషన్ నందు ఆటో డ్రైవర్లకు పొదిలి సిఐ చిన్న మీరాసాహెబ్, ఎస్ఐ శ్రీరామ్ లు కౌన్సెలింగ్ నిర్వహించారు అనంతరం పోలీసు సిబ్బంది ఆటోడ్రైవర్లు, ప్రజలు ర్యాలీగా పెద్దబస్టాండ్ చేరుకుని మానవహారం నిర్వహించి పొదిలి ఎస్ఐ శ్రీరామ్ వారిచే రహదారి నియమాలతో కూడిన నినాదాలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రహదారి నియమాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని, ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగి ఉండి ప్రతిఒక్కరు ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా ఉండాలనే లక్ష్యంతో ఈ రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఎస్ఐ శ్రీరామ్ మాట్లాడుతూ ద్విచక్రవాహనాలు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, కారు జీపులను నడిపేవారు సీట్లుబెల్టు ధరించాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్సులు, వాహన పత్రాలను కలిగి ఉండాలని అన్నారు. వాహన చోదకులకు అతివేగం పనికిరాదని నిర్దిష్ట వేగంతో ప్రయాణించినప్పుడే సురక్షితంగా ఉంటామని సూచించారు.

 

అలాగే రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, పోలీసు సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.