కూటమికి షాక్…ఇద్దరు నేతల గుడ్ బై

మహాకూటమిలో కలకలం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లో మాయావతిని మేనత్త (బువా) అని అఖిలేశ్ యాదవ్ ను  (భతీజా) మేనల్లుడు అని రాష్ట్రంలో సంబోధిస్తుంటారు. అయితే ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ కు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ ఎల్డీని కలుపుకొని కాంగ్రెస్ – బీజేపీయేతర ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సీట్ల పంపకంపై ఈ మూడు పార్టీల మధ్య అవగాహన కూడా కుదిరినట్టు హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ వెల్లడించింది. మాయావతి పుట్టినరోజు అయిన జనవరి 15న దీనిపై ఒక ప్రకటన వెలువడనుందని తెలిపింది. రాష్ట్రంలోని 80 లోక్ సభ స్థానాలకు గాను అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ ఎల్డీ)కి మూడు స్థానాలను కేటాయించాలని – మిగిలిన స్థానాలలో తామిద్దరం పోటీ చేయాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ – బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలిపింది. ఎస్పీ 37 సీట్లలో – బీఎస్పీ 38 స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. అయితే అమేథీ  – రాయ్ బరేలీ స్థానాలను మాత్రం విడిచి పెట్టినట్టు పేర్కొంది.