ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంకా గాంధీ

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంకా గాంధీకి ప్రముఖ రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభినందనలు తెలిపారు. ఇది భారత రాజకీయాల్లోనే సుదీర్ఘ కాలంగా ఎదురుచూసిన సందర్భమని ఆయన పేర్కొన్నారు. తూర్పు యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగిస్తూ ఆమె సోదరుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ… ‘‘భారత రాజకీయాల్లోనే అత్యంత సుదీర్ఘకాలంగా ఎదురుచూసిన సందర్భం ఎట్టకేలకు వాస్తవరూపం దాల్చింది. ఆమె వచ్చిన సమయం, కచ్చితమైన పాత్ర, స్థానంపై సర్వత్రా చర్చిస్తున్నారు. అయితే నా వరకు నిజమైన వార్త ఏమంటే.. రాజకీయాల్లోకి దూకాలని ఆమె ఎట్టకేలకు నిర్ణయించుకున్నారు. ప్రియాంక గాంధీకి అభినందనలు. శుభాకాంక్షలు..’’ అని పేర్కొన్నారు.